అక్షరటుడే, ఎల్లారెడ్డి: పంట పొలానికి అక్రమంగా విద్యుత్ కంచె ఏర్పాటు చేసి ఒకరి చావుకు కారణమైన ముద్దాయికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే రూ.15 వేల జరిమానా విధిస్తూ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు వెల్లడించారని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన తలారి సాయిలు 2008లో తన పొలానికి అక్రమంగా విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడు. అయితే గ్రామానికి చెందిన చౌల దత్తు విద్యుత్ కంచెకు తగిలి మరణించాడు. ఈ నేరం తన మీదికి రావద్దని ఉద్దేశపూర్వకంగా పక్కనున్న చెరువులో పడేసి సాక్షాలు లేకుండా చేశాడు. పోలీసులు కేసు విచారించి, సాక్ష్యధారాలను పరిశీలించి నేరం రుజువు చేశారు. దీంతో కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పుఇచ్చారు. కేసు విచారించిన సీఐ సుధాకర్, ఎస్సై సుఖేందర్ రెడ్డి, పోలీసుల తరపున వాదనలు వినిపించిన పీపీ నంద రమేశ్ ను ఎస్పీ అభినందించారు.