అక్షరటుడే, వెబ్​డెస్క్​: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. విశ్రాంత ఉద్యోగులకు శాపంగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ‘ఎక్స్’​ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు జతగా ఓ విశ్రాంత పోలీస్ అధికారి వీడియోను పోస్ట్ చేశారు. 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ అనే పోలీస్ అధికారి ఆవేదన చూస్తే హృదయం కలిచి వేస్తోందన్నారు.

ఒకవైపు రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స చేసుకుందామని హాస్పిటల్ కు వెళ్తే కార్డులు పనిచేయట్లేదని చెబుతున్నారన్నారు. ఇది ఒక నారాయణ సింగ్ సమస్య కాదని, రాష్ట్రవ్యాప్తంగా రిటైర్ అయిన 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవన్మరణ సమస్య అని చెప్పుకొచ్చారు.