అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : బీజేపీ నేతలు ఎలాంటి అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి మండిపడ్డారు. నగరంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లాకు అమృత్‌ స్కీం ద్వారా రూ.215 కోట్లతో 18 ట్యాంకులు, పైప్‌లైన్‌ నిర్మించి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందించడానికి ప్రణాళిక రచిస్తోందన్నారు. రూ. 168 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి మంత్రి ఛాంబర్‌ను ముట్టడిస్తామని చెప్పడం అవివేకమన్నారు. ఉద్యమ సమయంలో మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని అన్నారు. ఉద్యమ సమయంలో ఎక్కడో స్మగ్లింగ్‌ చేస్తూ బతికిన రాకేశ్‌రెడ్డి మంత్రిపై అవాకులు చవాకులు పేలితే కాంగ్రెస్‌ పార్టీ ఊరుకోదన్నారు. అంతర్జాతీయ స్మగ్లర్‌ రాకేశ్‌ రెడ్డి అని దుయ్యబట్టారు. నుడా ఛైర్మన్‌ కేశవేణు మాట్లాడుతూ వన్‌టైం వండర్‌లా ధన్‌పాల్‌ గెలుపొందారన్నారు. అమృత్‌ పథకం కింద నిధులు తామే తెచ్చామని బీజేపీ ఎమ్మెల్యే చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్‌ జావిద్‌ అక్రం, సీనియర్‌ నాయకులు నరాల రత్నాకర్‌, వేణురాజ్‌ తదితరులు పాల్గొన్నారు.