అక్షర టుడే ఇందూరు: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ ప్రాంతీయ సంచాలకులు రాఘవరావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కుటుంబాల విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధునిక పద్ధతులను నేర్చుకొని చేనేత వృత్తికి ఆధునిక సాంకేతికతను జోడించి అభివృద్ధి చెందాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 23 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 25 ఏళ్లలోపు ఉండాలన్నారు. విద్యార్థులకు నెలకు రూ.2,500 ఉపకార వేతనం అందించబడుతుందని తెలిపారు. సమావేశంలో సహాయ అభివృద్ధి అధికారి ప్రవీణ్ రెడ్డి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు డి.రామకృష్ణ, ఆర్మూర్ అధ్యక్షుడు కె.రామకృష్ణ, బోధన్ సంఘం అధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు.