అక్షరటుడే, ఇందూరు: డెంగీ నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ పిలుపునిచ్చారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా గురువారం అర్సపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలే చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి డెంగీ నివారణలో ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ముఖ్యంగా దోమ తెరలు వాడటం, ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వపరంగా సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి జ్వరంతో బాధపడే వారిని గుర్తించాలన్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి షేక్ సలీం, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు వెంకటేశ్వర్లు, హెచ్ ఈ ఓ శంకర్, మహమ్మద్, పర్యవేక్షకురాలు శ్యామల, స్వామి, శ్రీనివాస్, అనిత ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.