అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరలు పెంపునకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వును 24 గంటల్లో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏ నిబంధన ప్రకారం టికెట్ రేట్లు పెంచారు? అయినా రాత్రి పడుకోవాల్సిన సమయంలో సినిమాలేంటని ప్రశ్నించింది. గేమ్ ఛేంజర్ సినిమా అదనపు షోలు, టికెట్ ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ధర్మాసనంలో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని శుక్రవారం జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి పరిశీలించారు. అదనపు షోల పేరుతో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రాత్రి 11 తర్వాత థియేటర్లు, పబ్ల మూసివేతకు ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. తెల్లవారు జామున షోలకు అనుమతించరాదని చెప్పింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.