అక్షరటుడే, న్యూఢిల్లీ: అమెరికా వ్యాపార పోటీతత్వాన్ని, జాతీయ భద్రతను పెంచే చర్యగా 1977 నాటి విదేశీ అవినీతి పద్ధతుల చట్టం (FCPA) అమలును నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 10న కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. గత సంవత్సరం అమెరికా అధికారులు FCPA కింద అభియోగాలు మోపిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి ఈ చర్య ఉపశమనం కలిగించడం విశేషం.
అనుకూలమైన సౌరశక్తి ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు $250 మిలియన్లకు పైగా లంచం ఇచ్చారని ఆరోపిస్తూ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై US న్యాయ శాఖ 2024 నవంబర్‌లో అభియోగాలు మోపింది. ఈ అభియోగపత్రంలో సెక్యూరిటీల మోసం, FCPA ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి.