అక్షరటుడే, ఆర్మూర్‌: అంకాపూర్‌.. ఈ పేరు చెబితే నోరూరించే దేశీ చికెనే కాదు. వేడివేడిగా కాల్చుకుని తినే మక్క కంకులూ గుర్తొస్తాయి. ఈ రోడ్డు మీదుగా వెళ్లేవారు అక్కడ ఆగి మొక్కజన్న కంకులను కొనుగోలు చేయాల్సిందే..! అంతలా ఈ ఊరి మక్క కంకులు ఫేమస్‌. వానాకాలం సీజన్‌ వచ్చిందంటే అంకాపూర్‌ మార్కెట్‌ మక్కబుట్టలతో కళకళలాడుతుంది. కంకులను రాశులుగా పోసి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం అంకాపూర్‌లో డజన్‌ మక్క కంకులు రూ.50 నుంచి 80 వరకు విక్రయిస్తున్నారు. కాల్చిన మక్క కంకి రూ.10 నుంచి 20 వరకు విక్రయిస్తున్నారు.

మూడు నెలల పాటు విక్రయాలు

జూలై నుంచి అక్టోబర్‌ వరకు దాదాపు 3 నెలల పాటు అంకాపూర్‌ మార్కెట్‌ నుంచి మొక్కజన్న కంకుల విక్రయాలు కొనసాగుతాయి. పరిసర ప్రాంతాల్లో పండించిన పంటను ఇక్కడికి తెచ్చి విక్రయిస్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. ఇక్కడ ప్రతియేటా రూ.కోట్ల వ్యాపారం జరుగుతుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొక్కజొన్న సాగు బాగా ఉందని, లాభాలు సైతం బాగానే ఉన్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

15వేల ఎకరాల్లో సాగు..

ఆర్మూర్‌ నియోజకవర్గ పరిధిలోని వేల ఎకరాల్లో మక్క సాగవుతుంది. ఆర్మూర్‌, ఆలూర్‌ మండలంలో 5వేల 588 ఎకరాలు, మాక్లూర్‌ మండలంలో 6వేల ఎకరాలు, నందిపేట, డొంకేశ్వర్‌ మండలాల పరిధిలో 3వేల 950 ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేసినట్లు ఆర్మూర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ విజయలక్ష్మి తెలిపారు.