అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరగడంతో భారత నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా బుధవారం పీవోకేలో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ పేరిట నిర్వహించే కార్యక్రమంలో హమాస్ సీనియర్ నేత ఖలీద్ కద్దామి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సభను రావల్కోట్లోని సబీర్ స్టేడియంలో ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. దీనిలో ఉగ్రసంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, సీనియర్ నాయకులు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం జమ్మూకశ్మీర్‌పై హైలెవల్ సమావేశం నిర్వహించారు. భద్రత, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిని పర్యవేక్షించారు.