అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌లోని రెండో టౌన్‌ పరిధిలో రెండ్రోజుల కిందట భారీగా గుట్కా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఓ కారులో తరలిస్తున్న 20 బస్తాల గుట్కాను స్వాధీనం చేసుకుని, నాందేడ్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా.. నిజామాబాద్‌ నగరానికి చెందిన సుల్తాన్‌ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అనంతరం అతడిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే సుల్తాన్‌కు గుట్కా ఎక్కడి నుంచి వచ్చిందనేది చర్చకు దారితీసింది. నగర శివార్లలో పలువురు గుట్కా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరానికి చెందిన గుట్కా కింగ్‌గా ఉన్న ఓ పార్టీ నేత సోదరుడు పలు చోట్ల గుట్కా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వారే నిజామాబాద్‌తో పాటు పలు జిల్లాలకు గుట్కాను అక్రమ రవాణా చేస్తున్నారు. గతంలో గుట్కాపై వరుస దాడులు చేయగా మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో కార్ఖానాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసుల నిఘా తగ్గడంతో స్థానికంగా పలుచోట్ల గోదాములు ఏర్పాటు చేసి గుట్కా నిల్వలు దాచి ఉంచినట్లు తెలుస్తోంది. అలాగే సారంగపూర్‌కు చెందిన ఓ వ్యాపారి సైతం పెద్దఎత్తున గుట్కా అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. గుట్కా తయారీ మూలాలపై పోలీసులు దృష్టిసారిస్తే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. ఆ దిశగా తాజా కేసులో లోతైన విచారణ చేయాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.