అక్షరటుడే, నిజామాబాద్: ఆరేళ్ళ కన్న కొడుకును నీళ్లలో ముంచి, గొంతు పిసికి ఊపిరి తీసిన కన్నతల్లికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.శ్రీనివాస్ గురువారం తీర్పునిచ్చారు. వివరాలు… నిజామాబాద్ నగరంలోని నాగారం సంతోష్ నగర్ నివాసుడైన గడ్డం భరత్ కు సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన లావణ్య(మమత)తో పెళ్లి అయి ఇద్దరు కుమారులు జన్మించారు. చిన్న కొడుకు రణదీప్ తొమ్మిది నెలలకే చనిపోయాడు. కాగా లావణ్యకు తాగుడు అలవాటు ఉంది. కల్లు కోసం భర్త భరత్ ను బాధలకు గురిచేసి తెప్పించుకునేది. తాగుడు వద్దని చెప్పిన భర్త పైన, ఎటువెళ్తే అటు తనతోపాటు వస్తున్న పెద్ద కుమారుడు రోహిత్ పైన కసి పెంచుకుంది. ఒకరోజు రాత్రి సమయంలో భర్త కడుపు పై బ్లెడ్ తో కోసింది. మార్చి 29, 2023న ఆరు సంవత్సరాల కొడుకుని మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ దగ్గర్లో గల నిజాంసాగర్ కెనాల్ వద్దకు తీసుకెళ్లి నీళ్లలో ముంచి, గొంతు పిసికి చంపేసింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితురాలికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ వాదించారు.