అక్షరటుడే, జుక్కల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చూడాలన్నారు. ఆదివారం మహమ్మద్ నగర్లోని సొసైటీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జీపీని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మహమ్మద్ నగర్ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య గారి ఆకాశ్, నాయకులు గంగి రమేశ్, లౌకియా నాయక్, సవాయి సింగ్, నాగభూషణం గౌడ్, ఖాలిక్ తదితరులు పాల్గొన్నారు.