అక్షరటుడే, ఇందూరు: విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి కళా ఉత్సవ్ పోటీలు ఉపయోగపడతాయని డీఈవో దుర్గాప్రసాద్ అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో బాల భవన్ లో కొనసాగుతున్న కళా ఉత్సవ్ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు వాటిని గుర్తించాలని సూచించారు. నాటక ప్రదర్శన, మైమ్, జానపద, సాంప్రదాయ నృత్యం, సంగీతం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. న్యాయనిర్ణేతలుగా ఉపాధ్యాయులు ఘనపురం దేవేందర్, గంట్యాల ప్రసాద్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఏఎంవో జీవన్, బాల భవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.