అక్షరటుడే, కామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోందని.. జనవరి 3లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సర్వే తీరును పరిశీలించాలని తెలిపారు. జిల్లాలో 2,38,682 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు 1,39,194 దరఖాస్తులకు సంబంధించి సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈవో చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, మిషన్ భగీరథ, గృహ నిర్మాణ, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామీణాభివృద్ధి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.