అక్షరటుడే, వెబ్‌డెస్క్: కన్నడ యాక్టర్ యశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’ చిక్కుల్లో పడింది. ఈ మూవీకి గీతూమోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పర్యావరణానికి హాని కలిగించేలా చెట్లను కొట్టేసి షూటింగ్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు తాజాగా చిత్రబృందానికి నోటీసులు జారీ చేశారు. కర్నాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖాండ్రే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గతేడాది అక్టోబర్ నుంచి బెంగళూరు సమీపంలోని పీన్య ప్రాంతంలో మూవీ షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ కోసం అక్కడున్న వందల చెట్లను నరికేసి, భారీ సెట్స్ వేసినట్లు అటవీశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. కాగా.. ఈ ప్రాంతాన్ని అధికారులు హిందుస్థాన్ మెషిన్ టూల్స్ సంస్థకు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. దీనిపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది.