అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్ నగర శివారులో ఓ కార్పొరేటర్ దర్జాగా ప్రభుత్వ భూమిని కాజేసిన ఉదంతం గతంలోనే వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ.. చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం సదరు కార్పొరేటర్ అధికార పార్టీలో కొనసాగుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. సారంగపూర్ శివారులోని సర్వే నంబరు 19లో పూర్తిగా ప్రభుత్వ భూమి ఉంది. దీనికి అనుకుని నిజాంసాగర్ కెనాల్ ఉండగా ఆ స్థలంపై కన్నేసిన కార్పొరేటర్ ఓ దస్తావేజును సృష్టించాడు. 2008లోనే పేపర్లు ఉన్నట్లు రీస్కానింగ్ చేసిన డాక్యుమెంట్‌ను తెరపైకి తెచ్చాడు. మొత్తం 2.07 ఎకరాల భూమిని తన బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు పత్రాలు సృష్టించి వెంచర్ పనులు చేపట్టాడు. ఈ రెండెకరాల మొత్తానికి ఇంటినంబర్లు కేటాయించడంలో తాజాగా ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారి నరేందర్ కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారంలో ఉంది. ఆ తర్వాత సదరు కార్పొరేటర్ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మకాలు మొదలుపెట్టారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి దర్జాగా అమ్మకాలు మొదలుపెట్టినా.. సదరు కార్పొరేటర్ అధికార కాంగ్రెస్‌లో కొనసాగుతుండడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రూ.కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిన అవసరం ఉంది.