అక్షరటుడే, ఇందూరు: జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులున్నా.. ఒక్క స్టేడియం కూడా లేదు. గతంలో ఖలీల్వాడి ప్రాంతంలో స్టేడియం నిర్మించి అర్ధాంతరంగా కూల్చివేశారు. అక్కడ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని నిర్మించారు. అయితే క్రీడా సంఘాల ఒత్తిడితో నగర శివారులోని ముబారక్ నగర్లో కొత్త స్టేడియం నిర్మాణం కోసం ఏడెకరాల స్థలాన్ని ఇచ్చారు. స్టేడియం నిర్మాణానికి నిధులు లేకపోవడంతో ఇప్పటివరకు ఖాళీగానే ఉంది. స్థలంపై కబ్జాదారుల కన్ను పడటంతో ఇటీవల ఆ భూమిని చదును చేశారు. గమనించిన క్రీడా సంఘాల ప్రతినిధులు మంగళవారం అక్కడికి చేరుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు భూమిని చదును చేశారని, కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వాపోయారు హుటాహుటిన అక్కడ బోర్డును ఏర్పాటు చేశారు. ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ లింగన్న, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, మాజీ అధ్యక్షుడు బాగారెడ్డి, షూటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.6 కోట్ల నిధులు వెనక్కి..
2010లో ఖలీల్వాడి స్టేడియం స్థలంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. క్రీడా సంఘాలతో మాట్లాడి ముబారక్ నగర్లో స్టేడియం కోసం ఏడెకరాల స్థలంతో పాటు రూ.6 కోట్ల నిధులు విడుదల చేశారు. కానీ వివిధ కారణాలతో నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో నిధులు కాస్త వెనక్కి వెళ్లాయి. ప్రభుత్వాలు మారడం, నిధులు మళ్లీ విడుదల కాకపోవడంతో పనులు మొదలు కాలేదు. చివరకు భూమికి రక్షణ లేకుండా పోయింది.