అక్షరటుడే, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ సతీమణి, ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావ్ దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ చిత్రం 2025కి గాను భారత్ నుంచి ఆస్కార్ బరిలో నిలిచింది. ఇది హిందీ కామెడీ-డ్రామా చిత్రం. మార్చిలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 13 మంది గల సెలెక్షన్ కమిటీ 29 చిత్రాల జాబితా నుంచి లాపతా లేడీస్ చిత్రాన్ని ఆస్కార్ కోసం ఎంపిక చేసింది. తెలుగు చిత్రాలు కల్కి, హనుమాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆస్కార్ అత్యుత్తమ అంతర్జాతీయ చిత్రాల కేటగిరీలో లాపతా లేడీస్ పోటీపడనుంది.
చిత్ర సారాంశం
2001లో జరిగిన భారత గ్రామీణ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఇద్దరు కొత్తగా పెళ్లైన మహిళలు అకస్మాత్తుగా అదృశ్యమవడంపై కథనం సాగుతుంది. ఈ సినిమా ఆసాంతం హాస్యంతో కూడుకుంది. సమాజంలోని మహిళల హక్కులు, వివాహ వ్యవస్థ, పురుషాధిక్య ప్రపంచంలో మహిళల స్థానాన్ని సమర్థంగా చూపిస్తుంది. మానవ సంబంధాలు, సామాజిక కట్టుబాట్లు, గ్రామీణ జీవనశైలి నేపథ్యంలో వినోదాత్మకంగా తెరకెక్కింది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిరణ్ రావ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కిరణ్ రావ్ యొక్క రెండవ దర్శక కృషి.