అక్షరటుడే, వెబ్‌డెస్క్: కల్కి సినిమాపై హైందవ శంఖారావం సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారని, ఆయనను శూరుడు అంటే ఎవరు ఒప్పుకోరని.. సినిమాల్లో పురాణాలపై ఇలాంటి వక్రీకరణలు చేసి నేను సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు. ప్లాన్ ప్రకారమే సినిమాల్లో హైందవ ధర్మ హననం జరుగుతోందని, కొందరు అన్య మతస్తుల ప్రవర్తన ఇబ్బంది పెడుతోందన్నారు. అలాగే తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పాల్సిందేనన్నారు. మనదీక్ష దేవాలయ రక్ష పేరుతో విజయవాడలో విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాలు హైందవ శంఖారావం బహిరంగ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సభకు అనంత్ శ్రీరామ్ అతిథిగా పాల్గొని మాట్లాడారు. సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక నుంచి ప్రజలు భారీగా హాజరయ్యారు.