అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన మొదటిరోజే పౌరసత్వంపై జారీ చేసిన ఉత్తర్వులను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. జన్మతః వచ్చే పౌరసత్వం రద్దుపై డెమోక్రటిక్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారి పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయ స్థానాల్లో రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ అన్నారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి రాకుండా వెంటనే నిలిపివేయాలని కోర్టును కోరారు.

మనవారూ ఎక్కువే..

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిలో మెక్సికో, సాల్వెడార్ తర్వాత భారతీయులే అధికంగా  ఉన్నారు. సరైన పత్రాల్లేకుండా నివసిస్తున్నవారు దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో భారతీయులే సుమారు 7.25 లక్షలు ఉంటారని తెలుస్తోంది. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. న్యాయపరంగా ఎలాంటి అవరోధం లేకపోతే.. సంతకం చేసిన 30 రోజుల్లో ఈ ఉత్తర్వు అమల్లోకి వస్తుంది. అమెరికా జనాభాలో సుమారు 50 లక్షల(1.47 శాతం) మంది భారతీయులు ఉన్నారు. వీరిలో మూడోవంతు మంది అక్కడే పుట్టినవారు.