అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌ నగరంలోని ఓ కాంగ్రెస్‌ నేత ఏర్పాటు చేసిన వెంచర్‌పై నగరపాలక సంస్థ కొరడా ఝులిపించింది. సదరు నేత ఏర్పాటు చేసిన వెంచర్‌ అక్రమమని, తదుపరిగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. నగరానికి చెందిన మైనార్టీ కాంగ్రెస్‌ నాయకుడు ఎన్‌ఆర్‌ఐ కాలనీలోని సర్వే నంబరు 2871, 2872లో రెండున్నర ఎకరాల ఖాళీ స్థలంలో ఇటీవల వెంచర్‌ ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే హద్దురాళ్లు ఏర్పాటు చేసి అమ్మకాలు మొదలుపెట్టారు. కాగా వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవని, నాలా కూడా తీసుకోలేదని మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. లేఅవుట్‌ అనుమతులు లేవని తేల్చి.. తదుపరిగా సర్వే నంబరు 2871, 2872 లోని ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖకు వారం కిందట లేఖ రాసింది.