అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nithyananda : లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత్ వదిలి పారిపోయి, కైలాస దేశం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఆకర్శించిన నిత్యానంద.. ఇల్లీగల్ ఆక్టివిటీతో మరోసారి వార్తల్లో నిలిచారు. కైలాస సరిహద్దులను విస్తరించే ఆలోచనతో దక్షిణ అమెరికాలోని బొలీవియాలో నిత్యానంద తన శిష్యులతో కలిసి 4.8 లక్షల హెక్టార్ల భూమిని ఆక్రమించినట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ కేథరీన్ కాల్డెరాన్ తెలిపారు.
ఈ సమాచారం అందిన వెంటనే.. భారత్, బొలీవియా ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. నిత్యానంద తోపాటు అతని శిష్యులు మొదట బొలీవియాలోని గిరిజనుల భూమిని మోసపూరితంగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తర్వాత దానిని కైలాస విస్తరణగా ప్రకటించడానికి నిత్యానంద ప్రయత్నించారు. అయితే, అంతకు ముందే భూమి కొనుగోలు వార్త బయటకు వచ్చింది.
నిత్యానంద, ఆయన శిష్యులు కలిసి బొలీవియాలోని 4 లక్షల 80 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని 1000 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించినట్లు తెలిసింది. భూమి లీజుకు సంవత్సరానికి రూ. 8.96 లక్షలు, నెలవారీ మొత్తం రూ. 74,667, రోజువారీ మొత్తం రూ. 2,455 గా ప్రతిపాదించినట్లు సమాచారం.
బొలీవియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. బొలీవియా “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” అని పిలువబడే దేశంతో దౌత్య సంబంధాలను కొనసాగించడం లేదని పేర్కొంది. అంతర్జాతీయ సమాజంలో మరే ఇతర దేశం కూడా ఆ ప్రదేశాన్ని ఒక దేశంగా గుర్తించలేదని గుర్తుచేసింది.
అంతర్జాతీయ కథనాల ప్రకారం.. కైలాస ప్రతినిధులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి బొలీవియాలో చాలా రోజులుగా ఉంటున్నారు. ఆ భూమిని కాజేసేందుకు స్థానిక నాయకుల సాయం కూడా తీసుకున్నారు. ఒప్పందం ఖరారైన తర్వాత, నిత్యానంద శిష్యులు ప్రజల నుంచి ఒప్పందంపై సంతకం చేయించుకున్నారు. ఈ వార్త బయటకు వచ్చాక.. నిత్యానంద, అతని శిష్యులు స్థానిక జర్నలిస్టులను బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో.. నిత్యానంద చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసిందని అంటున్నారు.
2010 సంవత్సరంలో.. నిత్యానందకు సంబంధించిన ఒక అశ్లీల చిత్రాలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కేసులో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. 2012లో నిత్యానందపై అత్యాచారం కేసులు కూడా నమోదయ్యాయి. 2019లో ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసి బందీగా ఉంచిన కేసు నమోదైంది. అప్పటి నుంచి నిత్యానంద తప్పించుకుని తిరుగుతున్నారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానంద.. కైలాస అనే నకిలీ దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించారు. దానికి సొంత కరెన్సీ, రాజ్యాంగం ఉందని చెప్పుకొచ్చారు.