అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో తిరిగి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు జిల్లా విద్యా శాఖాధికారి దుర్గాప్రసాద్, మండల విద్యాధికారి రామారావు సోమవారం పాఠశాలలో తనిఖీ చేసిన సమయంలో పురుగుల అన్నం దర్శనమిచ్చింది. అయితే బియ్యంలోనే పురుగులు వస్తున్నాయని అధికారులు చెప్పడం గమనార్హం. ‘పురుగుల అన్నం.. నీళ్ల చారు’ అనే శీర్షికన ఈ నెల 19న ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితమైంది. ఈ విషయమై ఉన్నతాధికారులు ఆరా తీశారు. పాఠశాల హెచ్‌ఎంను వివరణ కోరారు. ఇదే సమయంలో ఏజెన్సీ నిర్వాహకులను సైతం హెచ్చరించారు. అయినా తీరులో మార్పు రాలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు తమ ఇంటి నుంచి లంచ్ బాక్సు తెచ్చుకుంటున్నారు. ఈ విషయమై విచారణ కొనసాగుతుందని ఎంఈవో రామారావు తెలిపారు.