అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వల్లే జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఏర్పాటు ఆలస్యం అవుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జక్రాన్ పల్లికి గ్రీన్ ఫీల్డ్, ఆదిలాబాద్, వరంగల్ కు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు మంజూరు అయిన విషయాన్ని గుర్తుచేశారు. ఓఎల్ఎస్, ఆప్టికల్ లిమిటేషన్ సర్వేలు పూర్తిచేసుకుని, కేంద్రంలో మాండేటరీ క్లియరెన్సులో ఉన్న వాటిని రాష్ట్ర సర్కారు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. కేవలం ఓఎల్ఎస్ సర్వే పూర్తి చేసి, మాండేటరీ క్లియరెన్స్ తీసుకుంటే సరిపోతుందని పునరుద్ఘాటించారు.