అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్‌కు ఎట్టకేలకు తాళం పడింది. గురువారం ఉదయం మాల్‌కు వచ్చిన ఆర్టీసీ అధికారులు మాల్‌ను సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. సాయంత్రంలోగా ఖాళీ చేయాలని దుకాణాదారులకు సూచించారు. ప్రకటించిన విధంగానే సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మాల్‌కు వచ్చి అందులో ఉన్నవారిని బయటకు పంపారు. అనంతరం మాల్‌ను సీజ్ చేసి ప్రధాన గేటుకు తాళం వేశారు. ఈ పరిణామం ఆర్మూర్ పట్టణంలో చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ మాల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి కుటుంబీకుల పేరిట ఉంది. ఇటీవల మాల్ సీజ్ చేస్తామని అధికారులు ప్రకటించగా.. ఎన్నికల వేళ తనపై కుట్ర చేస్తున్నారంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పైన ఆరోపణలు చేశారు. అనంతరం ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తాము చట్టపరంగానే మాల్ పైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు ప్రకటించిన విధంగానే ఎట్టకేలకు జీవన్ రెడ్డి మాల్ సీజ్ అయ్యింది.