అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ కి స్మార్ట్ సిటీ ఇవ్వాల్సిందేనని నార్త్ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఛైర్మన్ డాక్టర్ కేశవులు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా రాష్ట్రానికి అదనపు నిధులు దక్కుతాయని, తగిన తోడ్పాటు లభిస్తుందని తెలంగాణ ప్రాంత ప్రజలు ఆశించారని పేర్కొన్నారు. కానీ, వారికి నిరాశే మిగిలిందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు. స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణ వాటా 5.1 శాతంగా ఉందని గుర్తుచేశారు. కానీ బడ్జెట్లో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం దక్కలేదని, గిరిజన యూనివర్సిటీకి నిధులు సహా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డాక్టర్ బి.కేశవులు పేర్కొన్నారు.