అక్షరటుడే, తిరుమల: రథసప్తమి(ఫిబ్రవరి 4)ని పురస్కరించుకుని వేంకటేశ్వర స్వామి సప్త వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలను దర్శించేందుకు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదన్న ఛైర్మన్ బీఆర్ నాయుడు అదేశాలకు అనుగుణంగా టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా గ్యాలరీల్లో జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేశారు. 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు అందుబాటులో ఉంచారు. నిరంతరాయంగా టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారు అన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వితరణ కొనసాగనుంది. గ్యాలరీల్లోకి చేరుకోలేక బయట ప్రాంతాల్లో ఉండే భక్తులు వాహనసేవలను తిలకించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు, ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలు నిరంతరాయంగా ఉండనున్నాయి. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్‌ అధికారులకు విధులు కేటాయించారు.

వాహన సేవలు ఇలా..

ఉదయం 5.30 – 8 గంటలు :(సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) సూర్యప్రభ వాహనం

ఉదయం 9 – 10 గంటలు : చిన్నశేష వాహనం

ఉదయం 11- 12 గంటల వరకు : గరుడ వాహనం

మధ్యాహ్నం 1 – 2 గంటలు : హనుమంత వాహనం

మధ్యాహ్నం 2 – 3 గంటలు : చక్రస్నానం

సాయంత్రం 4 – 5 గంటలు : కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 – 7 గంటలు : సర్వభూపాల వాహనం

రాత్రి 8 – 9 గంటలు : చంద్రప్రభ వాహనం