అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యజామానులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ యూనివర్సిటీ వీసీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం మూడేళ్లుగా బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయకపోవడం వల్ల కాలేజీల నిర్వహణ కష్టమవుతోందని వివరించారు. ఏడాది నుంచి సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. భవనాల అద్దెలు కూడా చెల్లించలేకపోతున్నామని వాపోయారు. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకు వెళ్లారని వీసీకి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని కోరారు. లేకపోతే నిరవధిక బంద్ పాటిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, కార్యదర్శి సంజీవ్, మారయ్య గౌడ్, శంకర్, నరాల సుధాకర్, జైపాల్ రెడ్డి, బాలాజీ, గిరి, శ్రీనివాస్, సుజన్ రెడ్డి, శ్రీమతి మలేహ, దుష్యంత్, రమణ, శ్రీనివాస్ రెడ్డి, శివాజీ, నవీన్, హరికృష్ణ, సాయిబాబా పాల్గొన్నారు.