అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకోమని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి హెచ్చరించారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును ఏఎంసీ ఛైర్మన్​ ముప్ప గంగారెడ్డితో కలిసి గురువారం ఆయన సందర్శించారు. యార్డులో ఇటీవల జరిగిన దాడి ఘటన నేపథ్యంలో పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు. పచ్చి పసుపును యార్డుకు తీసుకు రావొద్దని రైతులకు సూచించారు. మార్కెట్​కు వచ్చే అన్నదాతలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులు సిండికేట్​ కాకుండా చూడాలన్నారు. మార్కెట్​ కమిటీ సెక్రెటరీ అపర్ణ, డైరెక్టర్ మల్లేశ్, మాస్టర్ శంకర్, లాబిశెట్టి శ్రీనివాస్, దేవేందర్, తారక్ వేణుగోపాల్, నారాయణ, గంగోని గంగాధర్, గడ్డం రాజు పాల్గొన్నారు.