అక్షరటుడే, నిజామాబాద్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీటు సాధించడం కష్టతరంగా మారింది. పాఠశాల స్థాయి నుంచే ఉత్తమ ఒలంపియాడ్‌ విద్య అందితేనే నేటి కాలంలో సీటు సాధించడం సులభమవుతుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల చూపు.. ఒలంపియాడ్‌ విద్య వైపు మళ్లింది. జాతీయస్థాయిలో పోటీని తట్టుకోవాలంటే స్కూల్‌ స్టేజీ నుంచే పిల్లలకు మెరుగైన విద్య అందించాలని భావిస్తున్నారు. అందుకే తమ పిల్లలను ఒలంపియాడ్‌ విద్యనందించే స్కూళ్లలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలకు పదును పెట్టడం, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొదించడంలో ఒలంపియాడ్‌ విద్య అందించే పాఠశాలలు ఎంతగానే దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నారు.

గత కొన్నేళ్లలో ఎంతో మార్పు

విద్యార్థులు గతంలో పదో తరగతి వరకు రాష్ట్ర సిలబస్‌ను అనుసరించి విద్యనభ్యసించేవారు. అనంతరం ఇంటర్‌ పూర్తి చేసి.. వేసవి కాలంలో ప్రత్యేకంగా ఎంసెట్‌ శిక్షణ తీసుకుని ఎంట్రెన్స్‌ పరీక్ష రాస్తే సీటు సులువుగా లభించేది. సిలబస్‌, ప్రవేశ పరీక్ష, విద్యార్థుల మధ్య పోటీ కేవలం రాష్ట్రస్థాయిలోనే ఉండేది. అడ్మిషన్‌ ప్రక్రియ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే జరిగేది. కానీ ప్రస్తుతం జాతీయస్థాయిలో ఇంజినీరింగ్‌ కోసం(ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌), మెడికల్‌ కోసం(నీట్‌) పరీక్షలను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడాల్సి వస్తోంది. ఐఐటీ, జేఈఈ, నీట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్‌ పొందాలంటే.. స్కూల్‌ స్థాయి నుంచే బాగా రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒలంపియాడ్‌ విద్య అందుకు బాటలు వేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఇంటర్మీడియట్‌ తర్వాత కోచింగ్‌ తీసుకోవడం వల్ల ఎంట్రెన్స్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చే అవకాశాలు కనబడడం లేదు. దీంతో ఇంటర్మీడియట్‌ తర్వాత ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌, మెడికల్‌ జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటాలంటే ఒలంపియాడ్‌ విద్య అనేది స్కూల్‌ లెవెల్‌లోనే తప్పనిసరి అయ్యింది.

ఇంటర్‌లో ర్యాంకులు వచ్చినా..

ఇటీవల విడుదలైన 2024 ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లాలో వందలాది మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించారు. కానీ, తర్వాత రోజే రిలీజైన 2024-ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో మాత్రం కనీసం పదుల సంఖ్యలో విద్యార్థులు కూడా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చలేకపోయారు. మరోవైపు స్కూల్‌ లెవెల్‌లోనే ఎవరైతే ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌తో పాటు ఒలంపియాడ్‌ ఎడ్యుకేషన్‌ కోచింగ్‌ తీసుకున్నారో ఆ విద్యార్థులు (99.68, 99.41, 99.22, 99.00, 98.30) పర్సంటైల్‌ మన జిల్లా నుంచి సాధించారు. ఇంటర్‌లో రాష్ట్రస్థాయిలో టాప్‌ మార్కులు సాధించినా.. ఎంట్రెన్స్‌ పరీక్షల్లో మాత్రం రాణించకపోవడానికి పాఠశాల స్థాయి నుంచే ఉత్తమ ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌తో పాటు ఒలంపియాడ్‌ విద్యాబోధన అందకపోవడం కారణంగా విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్‌లో వచ్చే ర్యాంకులు, మార్కులు కళాశాలల పబ్లిసిటీకి తప్ప.. విద్యార్థుల భవిష్యత్తుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. విద్యార్థి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే.. స్కూల్‌ లెవెల్‌ నుంచే ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ విద్య కూడా ఉత్తమంగా ఉండాలి. అందుకు ఒలంపియాడ్‌ విద్య ఎంతో దోహదం చేస్తుందని ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మంచి పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు పేర్కొంటున్నారు.