అక్షరటుడే, వెబ్ డెస్క్: ”ఠాగూర్ సినిమాను తలపిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి.. ఈ ఆస్పత్రిని నమ్మవద్దు.. వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దు” అంటూ మృతుని తాలుకా కుటుంబీకులు నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రైవేట్ ఆస్పత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని నిరసిస్తూ.. శుక్రవారం ఉదయం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నవిపేట్ మండలానికి చెందిన నారాయణకు గుండెపోటు రావడంతో వారం కిందట మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం సర్జరీ చేశారు. కాగా..గురువారం నారాయణ మృతి చెందాడు. కానీ, ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దాచి పెట్టారని, ఆరోగ్యశ్రీ కింద జరిగిన చికిత్సకు తమ వద్ద నుంచి అదనంగా డబ్బులు కట్టించుకున్నారని కుటుంబీకులు ఆరోపించారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ.. శుక్రవారం ఉదయం ఆస్పత్రి వద్ద నిరసన చేపట్టారు. ఆస్పత్రి నిర్లక్ష్యంపై ప్లకార్డులు ప్రదర్శించారు. తిరిగి సీపీ కార్యాలయానికి వెళ్లగా.. ఇంతలోనే పోలీసులు మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్సులో తరలించారు. ఆగ్రహానికి గురైన కుటుంబీకులు, బంధువులు తిరిగి నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఘటనపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.