అక్షరటుడే, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో ఆత్మహత్యలు కదిలించాయని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తో కలిసి బుధవారం బాసర గోదావరి వంతెన వద్ద పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాసర గోదావరి వద్ద ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ సహాయంతో బ్రిడ్జిపై ఇరువైపులా సుమారు ఆరు ఫీట్ల జాలీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బాసర పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేస్తామన్నారు. 24 గంటలు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళతో పాటు ఇద్దరు బ్లూకోట్ సిబ్బంది, గజ ఈతగాళ్లను సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. బాసర వంతెన సగభాగం నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉందని, దీంతో నిజామాబాద్ సీపీతో మాట్లాడి సమన్వయంతో పని చేస్తామన్నారు.