అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అయోధ్యలో నిర్మించిన రామమందిరం తొలి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తర్వాత బాల రాముడి ఆలయం నిర్మించుకున్నామన్నారు. మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ఈ ఆలయం ఘన వారసత్వంగా నిలిచిందన్నారు. ఈ మేరకు ఎక్స్‌వేదికగా ఓ వీడియోను మోదీ షేర్‌ చేశారు. శనివారం నుంచి ప్రారంభమైన ఆలయ వేడుకలు జనవరి 13 వరకు కొనసాగుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. శుక్ల పక్ష ద్వాదశి (22 జనవరి 2024) అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. విష్ణు మూర్తి దశావతారాల్లో రెండోదైన కూర్మావతారాన్ని ధరించిన రోజుది. ఈ ఏడాది కూర్మద్వాదశి జనవరి 11న రావడంతో వార్షికోత్సవాన్ని జరుపుతున్నట్లు ఆలయ ట్రస్ట్‌ స్పష్టం చేసింది.