అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణను దోచుకున్న ఏ ఒక్కరినీ వదలబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ దోపిడీకి పాల్పడిందని.. ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. వీరు చేసే ప్రతి అవినీతి తమవద్ద రికార్డు అవుతుందని, ఏ ఒకర్కిని కూడా వదలబోమని.. ఇది మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు. జగిత్యాలలో సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకుందని.. ఆ కుటుంబ పార్టీ నేతలు కాళేశ్వరంను ఏటీఎంగా మార్చుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడ దోచుకున్న సొమ్ముతో ఢిల్లీ లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకుందని విమర్శించారు. ఇక్కడ దోచుకున్న డబ్బులు ఢిల్లీలోని కుటుంబ పార్టీకి చేరుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ పార్టీ చేసిన అక్రమాలపై దర్యాప్తు చేయడంలేదన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకపోయినా బీఆర్‌ఎస్ ప్రశ్నించడం లేదన్నారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ కూడా కమీషన్లు తీసుకుందని వ్యాఖ్యానించారు. వీరి బంధాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని.. రెండు పార్టీలు కలిసి కేవలం మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అన్నీ ఆలోచించి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.