అక్షరటుడే, ఇందూరు: పెండింగ్ లో ఉన్న డిగ్రీ కళాశాలల ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హరిప్రసాద్, సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్లుగా బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు మంత్రులకు, అధికారులకు విన్నవించామని, ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించినా.. తమకు సమయం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కళాశాలలోని అధ్యాపకులకు గత ఐదు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇప్పటికే దసరాకు ముందు కళాశాలలను బంద్ పాటించామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. వినతి పత్రం అందించిన వారిలో సంఘం నాయకులు నరాల సుధాకర్, దత్తాత్రి, గిరి రాజ్, రాజేశ్వర్, సాయి రెడ్డి, రమణ కుమార్, రాజేంద్రప్రసాద్, ప్రతాపరెడ్డి, అరుణ్ కుమార్, తదితరులున్నారు.