అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రజాప్రతినిధులు అంటే.. చట్టసభల్లో ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేవారు. ప్రజల సంక్షేమం, వసతుల కల్పన, అభివృద్ధి పనులపై దృష్టి సారించేందుకు వీరిని ప్రజలు ఎన్నుకొన్నారు. కానీ కొందరు ప్రజాప్రతినిధులు వారి కర్తవ్యం విస్మరిస్తున్నారు. ప్రజల సమస్యలు ఎన్నో ఉండగా.. వాటిపై దృష్టి సారించకుండా.. సంబంధం లేని విషయాల్లో తల దూర్చుతూ.. అభాసు పాలవుతున్నారు. ఇటీవల అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలను పక్కనెట్టి.. అల్లు అర్జున్ విషయంలో పెద్ద లెక్చరే ఇచ్చారు. ఆ వెంటనే తప్పును సరిదిద్దుకున్నారు. ఇకపై పార్టీ నాయకులు ఎవరు కూడా ఈ విషయంలో మాట్లాడవద్దని స్పష్టంగా హెచ్చరించారు. అయినా ఇవేమీ లేక చేయకుండా తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మళ్లీ అల్లు అర్జున్ ను విమర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి.

ఎందుకు ఇంత షోకు..?

ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి సైతం ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు చేయడం చర్చనీయాంశంగా మారింది. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను విమర్శిస్తూ.. తామేదో ఉద్ధరించినట్లు ప్రవర్తించడంపై ప్రజల నుంచి సైతం విమర్శలు వెలువడుతున్నాయి. ఇలా విమర్శిస్తూ సినీ ఇండస్ట్రీపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారనే అపవాదు లేకపోలేదు. మరో కోణం ఏమిటంటే.. ఇలా ప్రముఖులను విమర్శిస్తూ.. గుర్తింపు పొందాలని చూడడం. మరి మన నాయకులు ఏమీ ఆశిస్తున్నారో వారికే తెలియాలి.