అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారిపై సొంత శాఖలోని అధికారులే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. సాక్షాత్తు ఓ మండల స్థాయి అధికారి లేఖాస్త్రం సంధించడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. డీఏవో పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ రెంజల్ ఏవో లక్ష్మీకాంత్ రెడ్డి ఆ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన అవినీతిని విభేదించడం వల్లే తనను కావాలనే టార్గెట్ చేసి వేధిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు.
మండలాధికారి లేఖలో ఆరోపణలివే..
- రెంజల్ మండలం సాటాపూర్‌కు చెందిన వివన్ ఆగ్రో కెమికల్స్‌కు గత ఫిబ్రవరిలో లైసెన్స్ జారీ చేయగా.. వారు జతచేసిన సర్టిఫికెట్‌పై మార్చిలో కొనుగోలు చేసిన బాండ్‌పేపర్ ఉంది. ఈ విషయమై డీఏవోను ప్రశ్నిస్తే తనను బెదిరించి లైసెన్స్ జారీ అయిన తర్వాత బాండ్‌పేపర్‌పై సంతకం తీసుకున్నారని ఆరోపించారు.
- కల్యాపూర్‌కు చెందిన శ్రీ రాజరాజేశ్వర ట్రేడర్స్‌కు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఫైల్‌ను డీఏవోకు పంపితే, ఆయన తన విస్తఅత అధికారాలు వాడకుండా, నువ్వే కేసు ఫైల్ చేసుకోమని తిప్పి పంపారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
- భూలక్ష్మిక్యాంప్‌నకు చెందిన వెంకటేశ్వర సీడ్స్, పెస్టిసైడ్స్ యజమాని సర్టిఫికేషన్ ట్యాగ్‌ల మార్పిడి, నకిలీ బిల్లుల జారీపై పూర్తి ఆధారాలతో పంపినా.. వెంటనే స్పందించకుండా, బోధన్ ఏవోతో కేసు ఫైల్ చేయిస్తానని తెలిపారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
- ఎఫ్‌సీవో-1985 నిబంధనలు పాటించకుండా 2024 వానాకాలం సీజన్‌కు సంబంధించి వ్యాపారం నిర్వహిస్తున్న రెంజల్ పీఏసీఎస్‌పై తాను 6ఏ కేసు నమోదు చేసి.. రూ. 10,66,601 స్టాక్ సీజ్ చేశాను. కాగా.. ఈ కేసు విషయంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా జిల్లా వ్యవసాయ అధికారి తనపై మండిపడ్డారని లేఖలో వివరించారు.
- నిజామాబాద్ జిల్లా ఏఈవోల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి బోధన్ పట్టణంలో పెద్దఎత్తున చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడని ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిషనర్‌కు రాసిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఇలా అక్రమాలకు పాల్పడిన జిల్లా అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏవో కోరారు.