అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ తిరుగులేని పోరాటం చేస్తుందని పార్టీ నేత, దీక్షా దివస్ జిల్లా ఇన్‌ఛార్జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేకపోతే ప్రజలకు తెలంగాణ సంక్షేమ ఫలాలు అందేవా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్ లో శనివారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరాటం ఫలితంగానే యంగ్ ఇండియా స్కిల్స్ కోసం అదానీ నుంచి తీసుకున్న రూ.100 కోట్ల విరాళం ప్రభుత్వం తిరిగి పంపించిందని పేర్కొన్నారు. విద్యార్థులకు సరైన భోజనం అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. గురుకులాలకు కేటీఆర్ వెళ్తే ఇబ్బంది అవుతుందని ఊహించి ముందుగానే మంత్రులను, కలెక్టర్లను పరిశీలనకు పంపిస్తున్నారన్నారు.
పార్టీకి ద్రోహం చేసిన పోచారం
పోచారం శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘ కాలం బీఆర్ఎస్‌లో అన్ని పదవులు అనుభవించి.. ఇప్పుడు ద్రోహం చేస్తూ పార్టీ మారారని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇలాంటి వారిని తరిమికొట్టాలన్నారు. దీక్ష దివస్‌కు వెళ్లకుండా ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా అధికార పార్టీ నాయకులను ఎదిరించి బాన్సువాడ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్ 45 కార్లలో రావడం అభినందనీయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా బెదరవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.