అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రభుత్వ బడిలో అడ్మిషన్‌ మొదలు ప్రతీది కూడా ఉచితమే. కానీ, జిల్లాలోని ఓ సర్కారు పాఠశాలలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇదేమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. అడ్మిషన్‌ కింద రూ.2 వేలు ఇవ్వాలని, విద్యా వాలంటీర్ల జీతాల కోసం ఈ డబ్బులు వెచ్చిస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వని విద్యార్థులను నిత్యం డబ్బుల కోసం వేధించడం చర్చనీయాంశంగా మారింది. నగర శివారులోని కాలూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ పరిస్థితి నెలకొంది. నిరంతరం విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండే పాఠశాలలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం గమనార్హం. అధికారులు స్పందించి అదనపు వసూళ్లకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.