అక్షరటుడే, కామారెడ్డి: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆదివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ లాంటి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించారని, తెలంగాణలో కూడా రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ గౌరవాధ్యక్షుడు శ్రీధర్ కుమార్, రాములు, కాళిదాస్ లింగం, మహమూద్, దినేష్, నవీన, లావణ్య తదితరులు పాల్గొన్నారు.