అక్షరటుడే, హైదరాబాద్: ప్రిజం పబ్ లో కాల్పులు జరిపిన నిందితుడి గురించి విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి గురించి మాదాపూర్ డీసీపీ వినీత్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ 2013 నుంచి నేరాలు చేస్తున్నాడు. రెక్కీ చేసి చోరీలు చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకుంటాడు.
ప్రభాకర్ 80 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 28 కేసుల్లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేరాలకు పాల్పడ్డాడు. 2020లో జైలులో ఉన్న సమయంలో తోటి ఖైదీ వేధించడంతో అతడ్ని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇప్పటి వరకు ప్రభాకర్ 66 కేసుల్లో అరెస్టయ్యాడు. 2022 మార్చిలో ఏపీలోని అనకాపల్లి కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకెళ్లిన సమయంలో పారిపోయాడు. 8 నెలల నుంచి తుపాకులు వాడుతున్నాడు.
ప్రభాకర్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ దగ్గర ఉన్నాడని తెలుసుకుని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడంతో హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి కాలికి బుల్లెట్ తగిలి గాయం అయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతని ఇంట్లో తనిఖీ చేయగా.. భారీగా తూటాలు దొరికాయి.