అక్షరటుడే, ఇందూరు: పాఠశాలలకు డుమ్మా కొట్టేందుకు కొందరు ఉపాధ్యాయులు తప్పటడుగులు వేస్తున్నారు. అదును దొరికితే చాలు డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు. ఇందుకు విద్యాశాఖ అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. నవీపేట మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడలకు ఏకంగా 64 మంది ఉపాధ్యాయులు డిప్యుటేషన్ వేయించుకున్నారు. ఇందుకు ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నాయకులు సైతం పైరవీ చేసినట్లు తెలిసింది. కమ్మర్‌పల్లి, భీమ్‌గల్, సిరికొండ, కోటగిరి, నందిపేట్ తదితర మండలాల నుంచి 48 మంది పీఈటీలు, 18 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు డిప్యుటేషన్ వేయించుకున్నారు. అయితే ఇందులో 22 మంది మాత్రమే క్రీడల నిర్వహణ కోసం పనిచేసినట్లు సమాచారం. మిగతా వారు డిప్యుటేషన్ పేరుతో విద్యాబోధనను పక్కనపెట్టారు. దీనిపై విద్యాశాఖ అధికారులను వివరణ కోరగా క్రీడల నిర్వహణకు హాజరైన వారికి మాత్రమే అటెండెన్స్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తతంగం ఉపాధ్యాయ సంఘాల మధ్య విభేదాలకు దారి తీసింది. కాగా ఈ విషయమై డీఈవో దుర్గాప్రసాద్ శనివారం సమావేశం నిర్వహించినట్లు తెలిసింది.