అక్షరటుడే, వెబ్ డెస్క్: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన స్టేషన్లలో నూతన డిజిటల్ పేమెంట్ విధానంలో నగదు రహిత టికెట్ పొందే సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై నేరుగా క్యూ ఆర్ కోడ్ ద్వారా జనరల్ టికెట్ పొందవచ్చు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లు, 31 కౌంటర్లలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, బేగంపేట్, వరంగల్, మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జి, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ స్టేషన్లు ఉన్నాయి. త్వరలోనే మిగితా స్టేషన్లలోనూ అమలు చేయనున్నారు.