అక్షరటుడే, నిజాంసాగర్: సన్నాలకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసిన అనంతరం గుల్ గస్తా వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ చరిత్రలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వందేళ్ల చరిత్ర ఉందన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. శాఖకు రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా లాభం చేకూరలేదన్నారు. పాలమూరు రంగారెడ్డికి రూ.27వేల కోట్లు ఖర్చుపెట్టినా కొత్తగా ఒక్క ఎకరాకు నీటిని అందించలేకపోయారని విమర్శించారు. రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోయిందన్నారు. కాళేశ్వరం నీటిని వినియోగించకపోయినా రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఈ యేడు వరి ధాన్యాన్ని పండించామన్నారు. రైతులకు ముందుగా ప్రకటించిన విధంగా రూ.500 బోనస్ అందించామని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పారు. నాగమడుగును త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లెండి ప్రాజెక్టుపై మహారాష్ట్ర అధికారులతో చర్చలు జరిపి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. నత్తనడకన కొనసాగుతున్న జాకోర నాగమడుగు లెండి ప్రాజెక్టులపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంత్రికి విన్నవించారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు షెట్టర్ల ఏర్పాటు కోసం నిధులివ్వాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. సమావేశంలో ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజ్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, ఆయా శాఖల చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.