అక్షరటుడే, జుక్కల్: కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షపాతి అని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ అన్నారు. గురువారం నిజాంసాగర్‌ మండలంలోని మాగి గాయత్రి చక్కర కర్మాగారం ఆవరణలో సీడీసీ చైర్మన్‌గా ఎండీ షాదుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాసుల బాలరాజ్‌ మాట్లాడుతూ.. రైతులు నూతన పద్ధతిలో పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. సీడీసీ చైర్మన్‌ షాదుల్లా రైతుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.. చెరుకు రైతులకు మద్దతు ధర మరింత పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మన ప్రాంతంలో కూడా ఎకరాకు 60 నుంచి 80 టన్నుల దిగుబడి వచ్చేలా నూతన పద్ధతిలో చెరుకు సాగు చేయాలన్నారు. నాయకులు జయ ప్రదీప్‌, వైస్‌ చైర్మన్‌ వేణుగోపాలరావు, కేన్‌ మేనేజర్‌ వెంగల్‌రెడ్డి, పండరి మోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి, గురునాథ్‌ తదితరులున్నారు.