అక్షరటుడే, వెబ్ డెస్క్: రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేయడానికి ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వడం, దీనికి ప్రతిగా రష్యా తన అణు ఆయుధ పాలసీని మార్చుకోవడం వంటి పరిణామాలతో స్టాక్ మార్కెట్లో యుద్ధభయాలు అలుముకున్నాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా పడిపోయాయి. చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమై లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 1,112 పాయింట్లు, నిఫ్టీ 327 పాయింట్లు పెరిగాయి. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పరిస్థితి మారిపోయింది. అంత వరకు భారీ లాభాలతో కొనసాగుతున్న మార్కెట్లకు అమెరికా, రష్యా తీసుకున్న నిర్ణయాలు పిడుగుపాటుగా మారాయి. ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కసారిగా పడిపోయాయి. చివరికి సెన్సెక్స్ 239 పాయింట్ల లాభంతో 77,578 పాయింట్ల వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,518 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ 50 లో దివిస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డి, అదానీ పోర్ట్స్, టైటాన్, ఐచర్ మోటార్స్, ఎంఅండ్ఎం, హీరో మోటార్, టాటా మోటార్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభపడగా.. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, హిందాల్కో, రిలయన్స్, మారుతి, ఎల్టీ, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా కన్స్యూమర్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్స్ నష్టపోయాయి.