అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఫెంగల్ తుఫాన్ కారణంగా తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది. ఈ తుఫానుపై సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెన్నై సహా ఆరు జిల్లాల్లో తుఫాన్ తీవ్ర ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ రాత్రికి చెన్నైలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సీఎం స్టాలిన్ సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని సీఎం తెలిపారు. చెంగల్‌పట్టు, మహాబలిపురం, కడలూరులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ భయంతో ఫ్లై ఓవర్లపై కార్ల పార్కింగ్, సబ్‌వేలను మూసివేశారు. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. అలాగే చెన్నై విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను సైతం నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. మెరీనా బీచ్ నిర్మానుష్యంగా మారింది. ట్రాక్ పైకి వర్షపునీరు చేరడంతో ఎలక్ట్రిక్ ట్రైన్ సర్వీసులు నిలిచిపోయాయి.