అక్షరటుడే, కామారెడ్డి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిజాయతీగా పని చేస్తూ.. గొంతుకగా ఉంటానని టీపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఉద్యమ నాయకునిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. తన వద్ద డబ్బు లేదని, డబ్బుతో ఎవరినీ కొనలేనని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు వారికి అనుకూలమైన పెట్టుబడిదారులను అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే సీపీఎస్ రద్దుపై మండలిలో చర్చకు పట్టుబడతానని, 317 జీవోపై పోరాడతానని, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుల బాబు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.