అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. పదేళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్ పాలనకు ఢిల్లీ ఓటర్లు చరమగీతం పాడారు. ఇదే సమయంలో దాదాపుగా 27 ఏళ్ల పాటు అధికారం కోసం శ్రమిస్తున్న బీజేపీ కల నెరవేరబోతోంది. ఢిల్లీ పీఠం దక్కబోతోంది. అయితే, ఆప్ ఘోర పరాజయానికి స్వయంకృతాపరాధమే కారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కాం, శీష్ మహల్ నిర్మాణం ప్రభావం చూపినట్టు చెబుతున్నారు.

విలాసవంతమైన జీవితం..

అరవింద్ కేజ్రీవాల్​పై తీవ్ర వ్యతిరేకతకు ‘శీష్ మహల్’ ఒక కారణమైందని చెప్పాలి. కేజ్రివాల్ అధికారంలో ఉన్న సమయంలో సీఎం నివాసానికి రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ దీనిని ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాగ్ నివేదిక సైతం ఈ ఖర్చుల్ని తప్పుపట్టింది. భవనం పునరుద్ధరణకు ప్రాథమిక అంచనా రూ.7.91 కోట్లు అని కాగ్ దర్యాప్తులో తేలింది. కాగా.. 2020 నాటికి రూ.8.62 కోట్లు, 2022 నాటికి రూ.33.66 కోట్లకు పెరిగింది. సాధారణ వ్యక్తిగా ఉంటానని ఢిల్లీ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని కేజ్రివాల్ దానిని మరిచారనే వ్యతిరేక ప్రచారం జోరుగా సాగింది.

జైలుకెళ్లిన వారిని ఇంటికి పంపిన ఓటర్లు..

ఢిల్లీలో ఆప్ ప్రతిష్టకు ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్’ భంగం కలిగించిందనే చెప్పాలి. టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈడీ, సీబీఐ సైతం ఈ కేసుని విచారించాయి. ఈ కేసు విషయంలోనే కేజ్రీవాల్​, సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి కీలక నేతలు జైలు పాలయ్యారు. ఈ నేపథ్యంలో జైలుకు వెళ్లిన నేతలంతా ఓటమిపాలయ్యారు.