అక్షరటుడే, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్‌పై దాడి వ్యవహారం.. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ వ్యవహారంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పట్నం నరేందర్‌ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్‌ పేరును ప్రస్తావించడం దీనిని నిర్ధారిస్తోంది.

ప్రభుత్వాన్ని అస్థిర పర్చే కుట్ర

నరేందర్‌రెడ్డిని కేటీఆర్‌ స్వయంగా ప్రోత్సహించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు అందులో వివరించారు. లగచర్లలో అధికారులపై దాడి చేసిన 46 మందిలో 19 మందికి అక్కడ భూములు లేవని ఐజీ ఇప్పటికే చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో వారి భూములు లేవని స్పష్టం చేశారు.

భారీగా తరలివచ్చిన నేతలు

కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్‌ నివాసానికి తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, కార్తీక్‌రెడ్డి తదితర నేతలు బుధవారం అర్ధరాత్రి వరకు అక్కడే ఉండిపోయారు. కేటీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. లగచర్ల ఘటన అనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు.

కేటీఆర్‌ ఏమన్నారంటే..

లగచర్ల ఘటనలో కుట్ర లేదని.. బలవంతంగా భూసేకరణ చేస్తుండటంతో కడుపు మండిన రైతులు తిరగబడ్డారని భారాస నేతలు చెప్పుకొస్తున్నారు. సురేశ్‌ అనే పార్టీ కార్యకర్త తన ఏడెకరాల భూమి పోతుండటంతో.. ఆవేదనతో అడిగారు. భూమి కోల్పోతున్న రైతులు అడగటం తప్పా.. సురేశ్‌ దాడికి పాల్పడినట్లు ఆధారాలున్నాయా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. పార్టీ కార్యకర్త సురేశ్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో మాట్లాడటం తప్పేమిటని ప్రశ్నించారు. కలెక్టరే స్వయంగా దాడి జరగలేదని చెబుతుంటే.. ఐజీ మాత్రం దాడి జరిగిందనటం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ఇంటెలిజెన్స్‌ వైఫల్యమేనని, అరెస్టు చేసిన రైతులకు న్యాయస్థానం సూచనల మేరకు ప్రైవేటు వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.